అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జూన్ 06, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొహెడలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ స్థల మార్పుపై మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొహెడ రైతులకు న్యాయం చేయకుండా మార్కెట్ శంకుస్థాపన చేయడం సరికాదని, మార్కెట్ కోసం రైతులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో సర్వే నంబర్లు 507, 548లో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఆ ప్రాంతంలో 170 ఎకరాల భూమిని రెవెన్యూ, ఇంజనీరింగ్, మార్కెటింగ్ శాఖల అధికారులు ఎంతో కష్టపడి అభివృద్ధి చేశారని తెలిపారు. మార్కెట్ కోసం డీపీఆర్ సిద్ధం చేసి రూ.300 కోట్లు కూడా మార్కెట్ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ భూముల్లోని రైతులకు రూ.17.25 కోట్ల పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సర్వే నంబర్ 167/1లో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. ఆ ప్రాంతంలో గుట్టలు, చెట్లు అధికంగా ఉండటంతో మార్కెట్ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. ఇప్పటికే అనుకూలమైన స్థలం అందుబాటులో ఉండగా దానిని వదిలి ఎత్తైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం వల్ల భవిష్యత్తులో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డారు. సర్వే నంబర్ 167/1లో 120 మంది రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని, ఇప్పటివరకు వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రైతులపై కేసులు నమోదు చేయడం, నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనకు ముందు పూర్తి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రైతులకు తక్షణమే పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో భూములను ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. మార్కెట్‌ను తిరిగి సర్వే నంబర్లు 507, 548లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, కళ్యాణ్ నాయక్, సంజీవరెడ్డి, ఆనంద్ రెడ్డి, దశరథ్, గౌతమ్ రెడ్డి, మల్లేష్, చెన్నయ్య, సంపదీశ్వర్, మోహన్ గుప్తా, మేతరి అశోక్, గౌని వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comment List