డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అటవీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాఖ పనితీరు, జిల్లాలోని అటవీ సంపద పరిరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అక్రమ కలప రవాణా, అటవీ భూముల ఆక్రమణలు, వన్యప్రాణుల వేట వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సహకారంతో అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

Comment List