విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విషాదం... గుర్తూరులో కన్నీరుమున్నీరైన కుటుంబం
మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు సెంటర్:-

తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
తొర్రూరు రూరల్ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గుర్తూరు గ్రామానికి చెందిన ఈదునూరి సమ్మయ్య (35) శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలోని బోర్ మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్‌ను తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
రాత్రి 9 గంటలైనా సమ్మయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా, విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన స్థితిలో కనిపించాడు.
యువ వయస్సులోనే సమ్మయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య కవిత, కుమారుడు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొర్రూరు రూరల్ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.

Comment List