తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీ సీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Comment List