గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
కిరాణా వర్తకుల సంఘంతో పోలీసుల కీలక సమావేశం

తొర్రూరు: గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు తొర్రూరు పోలీసులు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తొర్రూరు కిరాణా వర్తకుల సంఘం సభ్యులతో సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం సరఫరాపై నిఘా పెరగడంతో, గుడుంబా తయారీదారులు ప్రత్యామ్నాయంగా చక్కెరను వినియోగించే అవకాశం ఉందని వర్తకులను అప్రమత్తం చేశారు.
గుడుంబా తయారీదారులకు చక్కెర, బెల్లం లేదా ఇతర ముడి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించి సహకరించవద్దని కిరాణా వ్యాపారులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలను పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
నిషేధిత గుడుంబా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉద్దేశపూర్వకంగా విక్రయిస్తూ గుడుంబా తయారీదారులకు సహకరిస్తున్నట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యాపారులు, వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
గుడుంబా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు, వ్యాపారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని వారు కోరారు. గుడుంబా తయారీ లేదా ముడి పదార్థాల అక్రమ సరఫరాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
గుడుంబా నిర్మూలనలో కిరాణా వర్తకుల సహకారం కీలకమని పోలీసులు పేర్కొన్నారు.

Comment List