ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
భద్రాది కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఆగస్టు 15 :అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మృతి చెందిన ఘటనలో బూర్గంపాడు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.తేదీ 11.08.2026 రాత్రి నకిరేపేట అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అటవీ జంతువులను విద్యుత్ షాక్ ద్వారా వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చినట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్, తన డిఆర్ఓ అనార్కలి మరియు ఇతర సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ నిందితుల కోసం గాలిస్తుండగా అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.డిఆర్ఓ అనార్కలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణమైన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో లక్ష్మిపురం గ్రామంలోని ఆవుల నాగిరెడ్డి ఇంట్లో ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన ముగ్గురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి సమాచారం మేరకు నాలుగో నిందితుడు కన్నెదారి అనంతయ్యను నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని అతని నివాసం వద్ద అరెస్ట్ చేశారు.నిందితుల వివరాలు.. A1. ఆవుల నాగిరెడ్డి, తండ్రి: గురువారెడ్డి, వయస్సు: 44 సంవత్సరాలు, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, నివాసం: లక్ష్మిపురం.A2. దాసరి నరేష్, తండ్రి: మల్లయ్య, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: మటన్ షాప్, నివాసం: లక్ష్మిపురం.A3. తాటి వీరబాబు, తండ్రి: వెంకన్న, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: లక్ష్మిపురం.A4. కన్నెదారి అనంతయ్య, తండ్రి: సెబాస్టియన్, వయస్సు: 58 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: నాగినేనిప్రోలు రెడ్డిపాలెం.స్వాధీనం చేసుకున్న వస్తువులు నిందితుల వద్ద నుండి బైండింగ్ వైరు, విద్యుత్ తీగలు అమర్చేందుకు కర్రలు పాతడానికి ఉపయోగించే గడ్డపలుగు, ఖాళీ క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇలాంటి చర్యల వల్ల అమాయక అటవీ జంతువులతో పాటు అటవీ, పోలీసు అధికారులు మరియు సాధారణ ప్రజల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు.ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు.

Comment List