ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన
ప్రిన్సిపాల్ యెల్లదండి రాము
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ఇండియా ప్రతినిధి ) ఆగస్టు 5: కొత్తగూడెం ఎన్ కె నగర్ లోని ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను చిన్నారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయాలను చిన్నారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించింది. బోనాలు తెలంగాణ సంస్కృతి, అమ్మవారిపై భక్తి, సామూహిక ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన పండుగ.సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన చిన్నారులు తలపై అందంగా అలంకరించిన బోనాలను మోసుకుంటూ ఆకట్టుకున్నారు. పోతురాజు వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు, జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. పాఠశాల ప్రాంగణం రంగవల్లులు, పూలతోరణాలు, బోనాల అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు యెల్లదండి రాము మాట్లాడుతూ, చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం, వాటిని భావితరాలకు చేరవేయడం తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బోనాల పండుగ విశిష్టతను తెలుసుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

Comment List