ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇవ్వకుండా ఆస్పత్రి మూసివేసిన ఘటన ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో వెలుగుచూసింది. బీఎన్‌రెడ్డి నగర్‌లో నిర్వహిస్తున్న నీలాద్రి హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందికి జీతాలు చెల్లించకుండా ఆస్పత్రికి తాళం వేసిందని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌లో పనిచేస్తున్న దాదాపు 60 మంది సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వారు వాపోయారు. “హాస్పిటల్‌ను మరోచోటికి మారుస్తున్నాం.. ఇకపై రావాల్సిన అవసరం లేదు” అంటూ యాజమాన్యం ఒక్కసారిగా చెప్పిందని, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా సరైన సమయం ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 2026 మార్చిలోనే ఆస్పత్రి మూసివేసినా ఇప్పటి వరకు తమకు రావాల్సిన జీతాలు చెల్లించలేదని తెలిపారు. యాజమాన్యంపై విసుగు చెందిన కొందరు ఉద్యోగులు ఆస్పత్రి భవనంలోనే వంట చేసుకుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. “నా బిల్డింగ్‌లో ఎందుకు వంట చేస్తున్నారు” అంటూ భవన యజమాని వారు వండుకున్న అన్నాన్ని నేలకూల్చేశారని ఉద్యోగులు ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, హాస్టళ్లలో ఉంటున్న కొందరిని ఫీజులు చెల్లించలేదని బయటకు పంపిస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, నీలాద్రి హాస్పిటల్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదే యాజమాన్యానికి హయత్‌నగర్‌లో మరో ఆస్పత్రి కూడా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎల్బీనగర్ పరిధిలో అనుమతులు, పార్కింగ్ సౌకర్యాలు లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు అనేకం ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కొందరు ఆస్పత్రుల్లో కేవలం ఒక జనరల్ ఫిజీషియన్‌ను మాత్రమే ఉంచి, మిగతా వైద్య సేవలను ఇతర డాక్టర్ల సలహాలతో నిర్వహిస్తూ, కార్పొరేట్ స్థాయిలో బిల్లులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు అంటున్నారు. ఒకే భవనంలో పేర్లు, యాజమాన్యాలు మారుస్తూ ఆస్పత్రులు కొనసాగుతున్న ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఆస్పత్రులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comment List