ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహా శబరీష్, ఐఏఎస్
జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పోలీస్ శాఖ తరపున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం
కొనుగోలు కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి
రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి
కొనుగోలు కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ బందోబస్తు
ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియల్లో జాప్యం లేకుండా చర్యలు
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహా శబరీష్, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సకాలంలో అందేలా కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఈరోజు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల పరిధిలోని ఆలేరు మరియు లాస్య తండా గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహా శబరీష్, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కలిసి సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు, తేమ శాతం పరీక్షలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ధాన్యం తరలింపు ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ధాన్యం రవాణా సమయంలో ఎలాంటి అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం అధికారులు కొనుగోలు కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comment List