అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
వెలికట్టె గ్రామ రైతు సురేష్ యాదవ్
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు సెంటర్
గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, భూములకు స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని రైతు సురేష్ యాదవ్ కోరారు.
గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన, పాత భూ రికార్డులు, సరిహద్దు రాళ్లు లేకపోవడంతో పొరుగు భూముల యజమానుల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ వివాదాల కారణంగా సాగు పనులకు ఆటంకం ఏర్పడటంతో పాటు కోర్టు కేసులు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆధునిక సర్వే పరికరాలతో భూములను కొలిచి, ప్రభుత్వ రికార్డులకు అనుగుణంగా శాశ్వత హద్దులు నిర్ణయించి, సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇలా చేయడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
గతంలో సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు సురేష్ యాదవ్ తెలిపారు. ఆ వినతిపై స్పందించిన అధికారులు బుధవారం భూముల సర్వే చేపట్టారని చెప్పారు. అయితే అధికారులు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ రికార్డుల ఆధారంగా తమ భూమికి హద్దులు నిర్ణయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సర్వే అధికారులు మాట్లాడుతూ, సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు భూమిని సంబంధిత సర్వే నంబర్ల ఆధారంగా కొలిచి, నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comment List