మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 12:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ఎన్నికల నియమావళి ప్రకారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం రెండు రౌండ్లలో 60 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో ఆబ్జర్వర్‌ను నియమించడంతో పాటు అవసరమైన రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి ఎన్నికల నియమావళి, ఓట్ల లెక్కింపు విధానం, అనుసరించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందించామని వివరించారు. ప్రతి దశలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు.ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీల్ చేసి భద్రపరిచినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్‌లను తెరవనున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహించబడుతుందని, ప్రతి టేబుల్ వద్ద పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేందుకు ప్రత్యామ్నాయ జనరేటర్ సౌకర్యం కల్పించామని, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, వైద్య సహాయం వంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ…కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు స్థాయిల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. అనుమతిపత్రాలు కలిగిన సిబ్బంది, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు మరియు అధీకృత మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా బృందాలను మోహరించినట్లు తెలిపారు.కౌంటింగ్ కేంద్రం పరిధిలో చట్టవ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయుటకు సెక్షన్ 163-బి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ఐదుగురికిపైగా వ్యక్తులు గుమికూడరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక సైబర్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నియమావళి ప్రకారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ పరిశీలనలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, పాల్వంచ డిఎస్పి సతీష్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comment List