విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ ఫిబ్రవరి 14, న్యూస్ ఇండియా ప్రతినిధి:
చైతన్యపురిలో నడుస్తున్న అలేన్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పేరుకు ఇన్స్టిట్యూషన్‌గా కొనసాగుతున్నా, అవసరమైన అనుమతులు లేకుండానే స్కూల్, కాలేజ్ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజులు మాత్రం తమ సంస్థ పేరుమీద వసూలు చేస్తూ, 8వ, 9వ, 10వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులను చైతన్యపురిలో చదివించి, పరీక్షలు మాత్రం ఎల్బీనగర్‌లోని మరో స్కూల్ పేరుతో నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థుల విషయానికి వస్తే, దిల్‌సుఖ్‌నగర్‌లోని మరో కాలేజ్ పేరుమీద పరీక్షలు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. శ్రీతన్ ఆర్యన్ అనే విద్యార్థి ఇంటర్ సెకండియర్ చదువు కోసం అలేన్ ఇన్స్టిట్యూషన్‌లో చేరగా, పూర్తి ఫీజులు చెల్లించినప్పటికీ హాల్ టికెట్ అందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన తండ్రితో యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని ఆరోపిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల అండతోనే ఈ సంస్థ నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థికి న్యాయం చేస్తామని యాజమాన్యం కోర్టును ఆశ్రయించినప్పటికీ, సంబంధిత కాలేజ్ అధికారులు ఆ విద్యార్థి తమ వద్ద చదవడం లేదని కోర్టుకు స్పష్టంచేయడంతో హాల్ టికెట్ జారీ కాలేదని తెలిసింది. దీంతో ఫీజులు తీసుకుని బాధ్యతను మరో కాలేజ్‌పై మోపుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నేతలు కలిసి యాజమాన్యాన్ని నిలదీశారు. తమ తప్పిదం కారణంగా సమస్య ఏర్పడిందని అంగీకరించిన సంస్థ ప్రతినిధులు, విద్యార్థిని తమిళనాడులోని తమ మరో ఇన్స్టిట్యూషన్‌లో చదివిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే తెలంగాణలో చదువుతున్న విద్యార్థిని మధ్యలో తమిళనాడుకు మార్చితే నాన్-లోకల్ సమస్యతో పాటు విద్యాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యాశాఖ పనిచేస్తుండగా, అనుమతులు లేని కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. చిన్న స్కూల్లు, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునే అధికారులు ఇలాంటి పెద్ద సంస్థల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి విద్యార్థి పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే భారీ ఎత్తున ఇన్స్టిట్యూషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు.

Comment List