నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
హైదరాబాద్, మార్చి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: పొగాకు వ్యసనంపై సమాజాన్ని అప్రమత్తం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఒక అధికారి… రెండున్నర దశాబ్దాలుగా నిరంతరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయననే మాచన రఘునందన్. పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆయన, పొగాకు వల్ల కలిగే ప్రాణాంతక అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచే పనిని 22 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పొగాకు నియంత్రణలో చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రఘునందన్‌కు ‘టుబాకో కంట్రోల్ హీరో అవార్డు’ కూడా దక్కింది. ఇప్పటివరకు ఐదేళ్ల కాలంలో సుమారు 5,000 కిలోమీటర్లు ప్రయాణించి 500 గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. బుధవారం నిర్వహించిన నేషనల్ నో స్మోకింగ్ డే సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ధూమపానం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ప్రజలకు వివరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 2026 కిలోమీటర్ల మేర తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ‘నో స్మోకింగ్ ప్లీజ్’ అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం కృషి చేస్తున్న రఘునందన్‌కు ప్రజలు ‘పరివర్తన సైనికుడు’గా పేరుపెట్టారు. మేడ్చల్ జిల్లా కేశవరం ఆయన స్వస్థలం.

Comment List