నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
మైనింగ్ అధికారుల తీరుపై సీపీఐ ఆగ్రహం..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి డిమాండ్ చేసింది.
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
మైనింగ్ అధికారుల తీరుపై సీపీఐ ఆగ్రహం..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, డిసెంబర్ 15 న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి డిమాండ్ చేసింది.
ఈ అక్రమాలపై మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ, శుక్రవారం ఆటోనగర్ లోని నిర్మాణ స్థలం వద్ద సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి అధ్యక్షతన భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి మాట్లాడుతూ, నిర్మాణ సంస్థతో పాటు అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మన్సూరాబాద్ రెవెన్యూ పరిధిలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో సెల్లార్ త్రవ్వకాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 88,191 మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా త్రవ్వినట్లు మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు నిర్ధారించినప్పటికీ, ఇప్పటివరకు కఠిన చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. జనావాసాల మధ్య ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా జెలటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పగలు మట్టిని డంప్ చేసి రాత్రివేళ టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారని శేఖర్ రెడ్డి ఆరోపించారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం వల్లే మట్టి మాఫియా రెచ్చిపోతోందని సీపీఐ నేతలు విమర్శించారు. గతంలో విధించిన లక్షల రూపాయల జరిమానా ఇప్పటికీ వసూలు చేయకపోవడం వెనుక పెద్ద లాబీయింగ్ ఉందని ఆరోపించారు. తక్షణమే అక్రమ త్రవ్వకాలను నిలిపివేయాలని, అక్రమ మట్టి రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా వసూలు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే మైనింగ్ కార్యాలయాలను ముట్టడిస్తామని, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు బోయపల్లి రాములు గౌడ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, శ్రీదేవి, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comment List