ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసు కీలక మలుపు

On
ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసు కీలక మలుపు

న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్ హైదరాబాద్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసు కీలక మలుపుతిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ‘‘ప్రవళిక చనిపోయినట్టు శుక్రవారం రాత్రి మాకు సమాచారం అందింది. ఆమె గదిలో సూసైడ్ నోట్‌ దొరికింది. ఇప్పటివరకు ఆమె ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదు. ఆత్మహత్యపై  రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. శివరామ్‌ రాథోడ్‌ అనే వ్యక్తితో ఆమె చేసిన చాటింగ్‌ను గుర్తించాం. తనను మోసం చేసి శివరామ్‌ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ చాటింగ్‌ ద్వారా గుర్తించాం. శివరామ్‌, ప్రవళిక ఇద్దరూ నగరంలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్  కూడా దొరికింది. న్యాయపరంగా శివరామ్‌పై చర్యలు తీసుకుంటాం. మృతురాలి సెల్‌ఫోన్‌, సీసీటీవీ ఫుటేజ్‌, సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి ఆధారాలు సేకరిస్తాం. గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు ఆమె హైదరాబాద్‌ వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించాం. వ్యక్తిగత కారణాలతోనే అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ శ్రేణులు ఆందోళనకు దిగాయి’’ అని పోలీసులు మీడియాకు వివరించారు. చికడ పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా... అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి వరకు మృతదేహం హాస్టల్‌లోనే ఉంచి ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు రంగంలోకి దిగడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చారు.

Views: 73

About The Author

Post Comment

Comment List

Latest News