పాయకరావుపేటలో జగన్ ముద్దు- గొల్ల బాబూరావు వద్దు
ఎమ్మెల్యేపై స్థానికులతోపాటు సొంత వైసీపీ నుంచే అసమ్మతి సెగలు
కొత్త అభ్యర్ధిని నిలబెట్టే యోచనలో వైసీపీ హైకమాండ్
పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గొల్లబాబురావుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి బాబూరావుకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతామని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ వైసీపీలో ఈ అసమ్మతి సెగకు కారణమేంటి? గొల్లబాబురావుకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదా? మరి జగన్ మనసులో ఏముంది?
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే గొల్లబాబూరావుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి నిరసన సెగ అంటే షరామాములే అనుకోవచ్చు కానీ స్థానికులతోపాటు సొంత కేడర్ వైసీపీ నుంచే వ్యతిరేకత రావడం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. నాలుగేళ్లలో ఇష్టారీతిన తన సొంత వాళ్లకు దోచుపెట్టాడని స్థానికులు ఆరోపిస్తుండగా... అసలు వైసీపీ కేడర్ ను , నియోజకవర్గానికి సంబందించి సీనియర్లను అసలు పట్టించుకోలేదని వైసీపీ కేడర్ ఆరోపిస్తోంది. దీంతో అటు స్థానిక ప్రజలతోపాటు ఇటు సొంత కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎమ్మెల్యే గొల్లబాబూరావు ఎదుర్కొంటున్నారు.
గతంలోనూ సొంత పార్టీ కార్యకర్తల నుంచే గొల్లబాబూరావుకు అసమ్మతి సెగ తగిలింది. నియోజకవర్గ పరిధిలో రాజవరం, గజపతినగరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లిన బాబురావును ఆయా గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలోనే ఎమ్మెల్యే కాన్వారుని అడ్డగించి బాబూరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత పరిణామాలకు తోడు టీడీపీ నాయకులతో ఎమ్మెల్యేకు మంచి సంబంధాలు ఉన్నాయని.. వారితో లోపాయికారీగా ఎమ్మెల్యేకు ఒప్పందం ఉందనే ఆరోపణలూ వైసీపీ కమాండ్ సర్వేలో తేలడంతో.. కొత్త అభ్యర్ధికోసం వైసీపీ హైకమాండ్ వెతుకుతోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List