మానవత్వం చాటుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు
ఆ "పూర్వ" విద్యార్థులే ఆపద్బాంధవులయ్యారు
ఓ వ్యక్తి గాని... కుటుంబానికి గాని.. కష్టం వచ్చిందంటే వారికి ఓదార్పు ఎంతో అవసరం. ఆ ఓదార్పు తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, స్నేహితులు ఇలా పలువురి నుంచి లభించవచ్చు. ఆర్థిక లావాదేవీలతో అతలాకుతులమవుతున్న ఆ కుటుంబానికి స్నేహితుల ఓదార్పు ఎంతో సాంత్వన కలిగిస్తుంది. చిన్నతనం నుంచి తమతో కలిసి చదువుకొని, ఆటలాడిన ఓ మిత్రుడు కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకున్న పూర్వ మిత్రులందరూ కలిసి తలా కొంత పోగు చేసి వారి ఇంటికి వెళ్లి ఓదార్పు నివ్వడమే కాకుండా ఆర్థికంగా అండగా ఉంటామని భరోసానివ్వడం వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది. తమతో పాటు చదువుకున్న తోటి స్నేహితుడు మృతి చెందడంతో ఆ కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి పూర్వ మిత్రులందరూ తమ ఉదారతను చాటుకున్నారు. చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 10వ వార్డుకు చెందిన ఆటో మెకానిక్ గజ్జల శివ గౌడ్ ఈనెల 4న మరణించడం జరిగింది. తమ తోటి స్నేహితుడి మరణ వార్త తెలుసుకున్న 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒకటై స్నేహితుడు కుటుంబానికి అండగా నిలవాలనే దృఢ సంకల్పంతో 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరణించిన తమ మిత్రుడి కుటుంబానికి అందించి తమ ఉదారతను చాటుకున్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో శివ గౌడ్ పిల్లల చదువుల కోసం తగినంత ఆర్థిక సాయం చేయడానికి ఆ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని తెలిపారు.శివగౌడ్ తమతోపాటు చదువుకుంటూ చాలా సంతోషంగా ,ఉషారుగా, అందరితోటి ఉత్సాహంగా ఉండేవాడని ఇంత తొందరగా తమ అందరిని విడిచి వెళ్లడం చాలా బాధాకరమైన విషయమని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ మిత్రులందరూ కలిసి మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కే విమల, మహేశ్వరి, భాగ్య, చేవగోని రమేష్, శేఖర్ రెడ్డి, ఆరుట్ల లింగస్వామి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comment List