రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
•వివరాలు పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశం
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 09, న్యూస్ ఇండియా : రాష్ట్రంలోని గ్రామపంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్ కో సి.ఎం.డి., ఎస్.పి.డి.సి.ఎల్. సి.ఎం.డి, సింగరేణి కాలరీస్ సి.ఎం.డి లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నుండి కలెక్టర్ పి. ప్రావీణ్య వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కలెక్టరేట్లు, పార్కింగ్ ప్రాంతాలు, క్యాంటీన్లు, అలాగే ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలు సేకరించి వారం లోపు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల, రోడ్లు-భవనాల శాఖల పరిధిలోని ఖాళీ స్థలాల వివరాలు కూడా సమర్పించాలనిసూచించారు. కలెక్టరేట్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో నిర్మించబడినందున, అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుండి పంపిస్తామని, కలెక్టరేట్ల వద్ద ఉన్న మెరుగైన డిజైన్లు కూడా పంపవచ్చని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూముల్లో ‘ఇందిరా సౌర గిరిజల వికాసం’ పథకం ద్వారా ఉచిత సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, కలెక్టర్లు ఎటువంటి అలసత్వం లేకుండా నిర్ణీత గడువులో వివరాలు పంపాలని ఆదేశించారు. సందేహాలుంటే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు, అర్డిసిఓ విసి & ఎండి లను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను నిర్ణీత నమూనాలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List