ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థుల ఆందోళన..
తుర్కయంజాల్‌లో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, తోపులాట..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థులు ఆందోళన..
విద్యార్థులకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన....
తుర్కయంజాల్‌లో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, తోపులాట..
రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్, జూన్ 22, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, చదువు పూర్తయినా సర్టిఫికెట్లు అందజేయకుండా వేధిస్తున్నారంటూ తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. కళాశాల ప్రధాన గేటు ఎదుట భారీ సంఖ్యలో చేరిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ‘‘ప్రిన్సిపాల్ డౌన్ డౌన్’’, ‘‘విద్యార్థులకు న్యాయం చేయాలి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో సాగర్ హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఆదిభట్ల సీఐకి, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరిస్థితి తోపులాట వరకు వెళ్ళింది. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వచ్చిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు విద్యార్ధినిలపై చేయి చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన నిరసనను అణచివేయాలని పోలీసులు ప్రయత్నించారని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విషయంలో కళాశాల యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. చదువు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమ గోడును వినాల్సిన పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు హెచ్చరించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comment List