యాత్ర దానం ???
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 13, న్యూస్ ఇండియా : యాత్ర దానం – మానవత్వపు బహుమతి అని ఆర్టీసీ మెదక్ రీజియన్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెలియచేసారు. సామాజిక బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ), మెదక్ రీజియన్ లో నూతనంగా యాత్ర దానం అనే కార్యక్రమానికి సిద్ధమైందని మెదక్ రీజియన్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. సమాజంలో అనాధలు, నిరాదరణ పొందిన వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులు పుణ్యక్షేత్రాలు, విజ్ఞాన విహార ప్రదేశాలు దర్శించాలనుకుంటే వారి ఆర్థిక పరిస్థితుల వలన సాధ్యం కావడం లేదని ఆర్టీసీ గుర్తించింది. అలాంటి వారి కోరికలను నెరవేర్చడమే యాత్ర దానం ముఖ్య ఉద్దేశ్యమని రీజియన్ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం కింద దాతలు ఇచ్చే విరాళాల ఆధారంగా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబడుతుంది. కిలోమీటర్ల ప్రాతిపదికన లగ్జరీ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎనిమిది డిపోల నుండి పంపే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాతలు వ్యక్తిగతంగా, సంస్థల పేరుతో, లేదా తమ కుటుంబ సభ్యుల పేరిట విరాళాలు అందించవచ్చు. విరాళాల ద్వారా బస్సులు బుక్ చేసుకోవడానికి వారం రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం, అరుణాచలం, యాదాద్రి యాదగిరిగుట్ట వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సులు బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. దాతలు సమాజానికి మానవత్వపు బహుమతిని అందించవచ్చు. సహచరుల పట్ల ప్రేమ, అనురాగాలను వ్యక్తం చేయడానికి యాత్ర దానం ఒక వేదికగా నిలుస్తుందని విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. దాతలు విరాళాలు ఇచ్చి ఆర్టీసీ యాత్ర దానం నిధిని బలోపేతం చేస్తే, మరింతమంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సమాజానికి అవసరమైన చోట ఆర్టీసీ ఎల్లప్పుడూ ముందుండి సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comment List