కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
అనుబోస్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహణ
రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠం
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 13:తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలపై నేడు స్పష్టత రానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం వార్డు వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది.కౌంటింగ్ హాళ్లలో అభ్యర్థులు, అనుమతులు ఉన్న ఏజెంట్లకే ప్రవేశం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలింగ్ ఫిబ్రవరి 11న జరగగా, నేడు ఫలితాలు ప్రకటించనున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పాల్వంచ అనుబోస్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Comment List