జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
• తక్షణమే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం • సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు • ‘ట్రీట్‌మెంట్ లో నో కాంప్రమైజ్': ఆరోగ్యశాఖ మంత్రి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 30, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రక్షణ సహాయ చర్యలు అందించడం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోవడానికి వారికి తక్షణ సహాయ చర్యల కోసం 08455 276155 నెంబర్ తో కూడిన కంట్రోల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్షణ సహాయ చర్యల కోసం, ప్రమాద బాధితుల వివరాల కోసం ఈ నెంబరు లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. పాశమైలారం దుర్ఘటనలో గాయపడి దృవ, ప్రణామ్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధిత పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. ట్రీట్‌మెంట్‌లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండొద్దని ఆదేశించారు. బాధితుల ఆరోగ్యం కుదుటపడే వరకూ హాస్పిటల్స్‌లోనే ఉండి వారికి అవసరమైన వైద్య సహాయక సేవలు అందించాలని జిల్లా డీఎంహెచ్‌వోను, ఇతర మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులను హాస్పిటల్ వద్ద మంత్రి పరామర్శించి, వారిని ఓదార్చారు. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారికి మంత్రి భరోసానిచ్చారు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Comment List