బతుకమ్మ వేడుక...... తెలంగాణ సాంస్కృతికి ప్రతీక
సత్యం, శివం, సుందరం, సమ్మేళనమే బతుకమ్మ
న్యూస్ ఇండియా తెలుగు :అక్టోబర్ 14 రిపోర్టర్ శెట్టి. థామస్ . తెలంగాణ ప్రాంత ఉనికిని తెలియజేస్తూ మాది అని గర్వంగా చెప్పుకునే తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ప్రకృతి "సత్యం"ఆ ప్రకృతిని దైవంగా భావించటం "శివం"అందంగా అలంకరించటం "సుందరం"ఈ మూడింటి సమ్మేళనమే బతుకమ్మ పండుగని బహుజన సాహిత్య వేదిక జిల్లా కన్వీనర్ వజ్రం నాగేశ్వరరావు వెల్లడించారు.
ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత, పరమార్ధం ఉన్నాయి. బతుకు ఇచ్చిన అమ్మ, బతుకు నేర్పిన అమ్మ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా తల్లి బతుకమ్మ పండుగ నిలుస్తుంది. జీవవైవిద్యాన్ని కాపాడే ఈ పండుగ తెలంగాణ జీవనశైలిని విశిష్టతను ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతున్నది.
బతుకమ్మ అంటే.. బతుకు + అమ్మ= బతుకమ్మ.. బతుకును ఇచ్చి, బతుకు నేర్పి, బతికించే అమ్మ అందుకే తల్లి బతుకమ్మ అయింది. పూలతో కూడిన అమరిక అని అర్థం. రకరకాల పూలతో బతుకమ్మ తాంబాలంపై వరుసల్లో పేరుస్తారు. పేర్చిన బతుకమ్మను తీసుకొని దేవాలయాల ముందు చేరి తీసుకొచ్చిన బతుకమ్మలను మధ్య భాగంలో ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ అందరు ఒకే గొంతుతో గీతాలు ఆలపిస్తారు. సాధారణంగా పూలతో భగవంతుని పూజిస్తారు, కానీ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పూలనే పూజించుటం ప్రత్యేకతను చాటి చెబుతున్నది.
బతుకమ్మ చరిత్ర... లక్ష్మీదేవి అనుగ్రహించి సత్యవతికి (ధర్మాంగుడనే రాజు సతీమణి) కుమార్తె జన్మించింది, దేవతలు ముని పుంగవులు చల్లగా బతకమని "బతుకమ్మ"ను దీవించారు. కరువు కాటకాలతో ప్రజలు కాలం చేస్తుంటే.. ప్రజలంతా గ్రామ దేవత గౌరీదేవిని పూజించి జనాన్ని బతికించుకుంటారు, నిదర్శనంగా గౌరీదేవిని పూలతో పూజించి ఆడే ఆటే బతుకమ్మ, 1,మొదట ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభమై, చివరి 9,తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో స్మరిస్తూ పండుగ చేసుకోవడం ఆచారంగా మారింది.
సద్దుల బతుకమ్మ... చివరి రోజు చేసే బతుకమ్మను సద్దుల బతుకమ్మగా వ్యవహరిస్తారు. సద్దులు అంటే పిండి పదార్థాలతో బతుకమ్మకు సమర్పించే నైవేద్య ముద్దలనే "సద్దులు"అంటారు. ఈ సద్దులను నైవేద్యంగా పెట్టడంతో "సద్దుల బతుకమ్మ" అని పిలుస్తారు. అలంకరించిన బతుకమ్మలను మేల తాళాలతో సకల జనులు కలిసి ఊరేగింపుగా నీటి చెంతకు తీసుకెళ్తారు. ఆడి పాడి గంగాదేవి పూజ చేసి హారతిని ఇచ్చి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా అని సాగనంపుతారు. సద్దులను ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ.. ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటి నమ్మ వాయినం అని చెప్పుకుంటారు.
ముగింపు... బతుకమ్మను నీటిలో విడిచి పెట్టడంతో పూలు, ఆకులతో ఉండే రసాయనాలు ఔషధ గుణాలను కలిగి ఉండి నీటిని శుద్ధి చేయును, పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది. తెలంగాణ ఊపిరిగా ప్రజాజీవనంలో మమేకమై పుంఖాను పుంఖాల పాటలకు పుట్టినిల్లుగా బతుకమ్మను కీర్తిస్తారు.
జాతీయ హోదా కల్పించాలి.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచిన బతుకమ్మ పండుగను పురుషాధిక్య సమాజంలో స్త్రీలు తమకంటూ ఒక పండుగను జరుపుకోవడం స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలకు మచ్చుతునకగా భావించవచ్చు, కేంద్రం ప్రభుత్వం బతుకమ్మ పండుగకు "జాతీయ హోదా "కల్పించి, జాతీయ ఉత్సవంగా నిర్వహించవలసిన అవసరముంది.
Comment List